Archive for February, 2008

తోటి పత్రికలు

సాటి వారి సమీక్ష అని వికీలో ఓ ముఖ్యమైన అంశముంది. మనం రాసిన దాన్ని మన తోటివారు సమీక్షిస్తారన్నమాట! పొద్దు అలాంటిదే ఓ పని చేసింది. సాటి పత్రికల గురించి రాసింది. అయితే ఇది సమీక్ష కాదుగానీ, ఓ పరిచయం అంతే! పోటీ ప్రపంచమిది.. ఒకరిని మించి ఒకరు దూసుకు, తోసుకు పోవాలనే ధోరణులున్న రోజులు! అలాంటిది, సాటి పత్రికల గురించి ఓ పత్రిక బొమ్మలతో సహా పరిచయ వ్యాసం రాయడమా!?

అవును, రాయడమే!!

ఈ వ్యాసం రాసేందుకు మేం చేసిన పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. అవన్నీ ఆ వ్యాస పరిధిలోవి కాదు కాబట్టి, రాయలేదు.

  • వాటిలో ఒకటి.. కొన్ని పత్రికల వారికి ఒకరంటే ఒకరికి పడదు.
  • మరోటి.. పొద్దు వచ్చాక, కొన్ని పత్రికల ధోరణిలో మార్పు వచ్చింది. :) కుశాగ్రబుద్ధులైన పొద్దు పాఠకులు ఆ సంగతి గ్రహించే ఉంటారు.

పోతే, ఓ రెండు కొత్త సాంకేతికాలను పొద్దుకు జోడించాం. చూడండి.

మృతజీవులు

చనిపోయిన జీతగాళ్ళను కొనుక్కోడానికి దేశాటనం చేస్తున్నాడు ఈ నవల్లో హీరో!

నికొలాయ్ గోగోల్ రష్యనులో రాసిన మ్యోర్తవ్యే దూషి నవలకు కొడవటిగంటి కుటుంబరావు మృతజీవులు పేరిట తెలుగులోకి అనువదించారు.

వాక్యం సగంలో ముగిసిన ఈ నవల అనువాదాన్ని పొద్దు సీరియల్‌గా ప్రచురిస్తోంది. పదిహేనో భాగాన్ని చదవండి.

పొద్దు గురించి చెబుతున్నారు

ఉగాది వస్తోందని, కోయిల ముందే కూస్తోంది. రాబోయే ఉగాది సాహితీ సందడికి గాను తమ తమ పాళీలు నూరమని రచయితలకు, బ్లాగరులకు చెబుతున్నారు పొద్దు సంపాదకుడు దేవరపల్లి రాజేంద్ర కుమార్, తమ సంపాదకీయంలో. పొద్దు సంపాదకవర్గం తమకూ ఓ పేజీ ఉండాల్సిన సమయం వచ్చిందని గ్రహించింది. ఇక నుండీ సంపాదకీయం పేజీ సంపాదకులకే.. మొదటిపేజీ ఇక కేవలం మొదటి పేజీ అంతే!

చినుకు కోసం రైతు చూసే ఎదురుచూపుల వ్యథను వివరిస్తున్నారు జోగధేను స్వరూప్ కృష్ణ తమ కవితలో.

పొద్దు గురించి చెప్పే ఓ పేజీ ఇప్పటిదాకా లేదు పొద్దులో! ఆ లోటు తీరిందిక!

పొద్దులో రా(సి)నారె!

అక్షరాలను దూసి

మలచి మాలగ జేసి

తెలుగుతల్లికి వేసి

ధన్యుడయ్యెను మనిషి!

 

(ఏంటో.. రానారెను తలిస్తేనే పద్యాలొస్తున్నాయి! పాదాలూ మాత్రలూ కూడా పెరిగిపోతున్నాయి.)

వచనమైనా నిర్వచనమైనా అలవోకగా రాసుకెళ్ళిపోయే రానారె, లాగులు తొడుక్కునే టప్పటి నుండీ రాస్తున్నాడు. లాగుల నాడైనా, బ్లాగుల నాడైనా అందరిలోకీ ఆతడే ముందు! పొద్దులో అతడి బ్లాగులపై సమీక్ష చూడండి!

———————–

రా(సి)నారె అనే ఈ జాబు శీర్షికను ఎక్కడి నుండి కొట్టుకొచ్చామో తెలిసిపోయింది కదా! :)

నే తెచ్చుకున్నా, ఏమననందుకు వారికి మా నెనరులు!

అనువాద శంకరుడు

కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్ గారు. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని సాధక బాధకాలను వివరిస్తున్నారు.

ఒక నెల తరువాత మళ్ళీ గడిని మీముందుకు తెస్తున్నాం. సమయానికి గడి తీసుకురాకపోయినా, తెచ్చిన గడి మెచ్చేలా ఉంది. పాఠకులు ఎంతో మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ సరిగ్ఘా పూరించి పంపే వారు తక్కువగానే ఉంటున్నారు.

గడిని ఎలా నిర్మించాలి, ఎలా పూరించాలి అనే విషయాలపై నేర్పరులైన కూర్పరులిద్దరు కబుర్లాడుకుంటూ చెప్పే ఏర్పాటు చెయ్యబోతున్నాం. వివరాలు త్వరలోనే!

నూతనోత్సాహం

ఈనాడులో ఫిబ్రవరి 3 న వచ్చిన వ్యాసం తెలుగు వెబ్ లోకాన్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తింది. వికీపీడియాపై దృష్టి కేంద్రీకరించిన ఈ వ్యాసం ఇప్పటి వరకూ వెబ్‌లో తెలుగుపై వచ్చిన వార్తా కథనాల్లోకెల్లా విస్తృతమైనది, లోతైనదీనూ. నెజ్జనులు ఈ వ్యాసాన్ని స్వాగతిస్తూ ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు. తొలికోడి కూడా వారితో గొంతు కలిపి ఈనాడుకు నెనరులు తెలుపుతోంది.

ఇకపోతే బ్లాగు లోకంలో జనవరిలో ఏమెం జరిగాయో గమనించారా? ఎవరెవరేమేం రాసారో చదివారా? చదవలేదా! పోన్లెండి, ఏం పర్లేదు.. ఆ విషయం తెలుసుకునే అవకాశం పొద్దు మీకిస్తోంది. జనవరి బ్లాగుల ప్రస్థానాన్ని లిపిబద్ధం చేసింది, పొద్దు. జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ! అనే పేరుతో ఒక వ్యాసాన్ని ప్రచురించాం. ప్రతీ ఒక్క బ్లాగునూ ఆ వ్యాసంలో పొందుపరచలేకపోయినప్పటికీ, ముఖ్యమైన విషయాలపై జాబులు వెలువరించిన బ్లాగులను అక్కడ ఉంచామనే అనుకుంటున్నాము. ఓసారి చూడండి. దాన్ని మరింత సమగ్రంగా చేసేందుకు మాకు సూచనలివ్వండి.

ఈ వ్యాసంతో పాటే అసూర్యంపశ్య రాసిన ఆ దారి కవితను కూడా ప్రచురించాం.