Archive for March, 2008

సమూల వీక్షణ -సమీక్ష

స్థాలీపులాక న్యాయం అనే మాట వినే ఉంటారు. అన్నమంతా చూడకుండా ఒక మెతుకును పట్టి చూసినా సరిపోతుందనే సిద్ధాంతమది. మన పుస్తక సమీక్షకులు చాలా ఎక్కువగా వాడే మాట, ఆచరించే పద్ధతి అది. విమర్శకులు మాత్రం అలాక్కాదు.., చాలా కూలంకషంగా ప్రతి మెతుకునూ పట్టిపట్టి మరీ పరిశీలిస్తారు.

కలం కలలు అనే బ్లాగును చూపించి, దాన్ని సమీక్షించండి అని సాలభంజికలు నాగరాజు గారిని కోరాం. ఆయన ఆ బ్లాగును శీర్షం నుండి ఫుటరు దాకా గాలించి, బ్లాగరి శైలిని, రచనా దృక్పథాన్ని, తాత్వికతను ఒడిసి పట్టారు. ఈ ఎస్సెన్సునంతా ఆ బ్లాగరి ఫోటోతో జోడించి ఒక సమీక్ష (విమర్శ) వ్యాసం రాసిపెట్టారు. ఫణీంద్ర అనే బ్లాగరి గొడవ గురించి తెలిసికొనేందుకు కలంకలలు చూడాలి. ఫణీంద్ర గురించి తెలిసికొనేందుకు నాగరాజు గారి ఘలం ఘలలు చూడండి.

జాన్ హైడ్ కనుమూరి స్త్రీ సమస్యలపై వచ్చిన కవిత్వ సంకలనం సమీక్ష కూడా చదవండి.

తెలుగులో రాయటం ఎలాగంటే..

పై శీర్షికను బిగ్గరగా చదవండి. “తెలుగులో రాయ..” వరకు చదవగానే మన బ్లాగరులు ఠక్కున అందుకుని కంప్యూటర్లో తెలుగులో ఎలా రాయాలో చెప్పెయ్యడం మొదలెట్టేస్తారు, తెరపట్టులతో సహా! రాసే పద్ధతి ఇప్పుడెలా ఉందో చెప్పటమే కాకుండా, ఓ నాలుగైదేళ్ళ తరవాత ఎలా మారబోతోందో కూడా చెప్పేస్తారు. (అలాంటి ఉత్సాహవంతుల కారణంగానే అంతర్జాలంలో తెలుగు ఉజ్వలంగా వెలుగుతోంది. అది మరువరాదు)

అయితే.. కొడవటిగంటి రోహిణీప్రసాదుగారు కాలంలో వెనక్కివెళ్ళి అసలు లిపి ఎలా పుట్టింది అనే సంగతిని వివరిస్తున్నారు. ఆశ్చర్యపరచే విషయమేంటంటే.. ఆ ప్రాచీన లిపులను నేరుగా రాసెయ్యొచ్చట, మన ఇన్‌స్క్రిప్టు లాగా! ముందు ఇంగ్లీషులో (రోమను లిపిలో) రాసి ఆపైన లిప్యంతరీకరణ చెయ్యనక్కరలేదు. మీరూ అవాక్కయ్యారా? కామూ మరి!!! ప్చ్! అవున్లెండి, పురాతన లిపులు కదా.. అంతగా అభివృద్ధి చెందినట్టు లేవు.

ఈ మధ్య ఈనాడులో ఒక ఫోటో పెట్టారు. ఒక పొడుగు కాళ్ల సుందరి రోడ్డుమీద దర్జాగా నిలబడి ఉంటుంది. మగ జనం ఒక వరుసలో ఆ రోడ్డు మీద పడుకుని, మోరలెత్తి ఆ సుందరి దయార్ద్ర దృక్కుల కోసమా అన్నట్టు చూస్తూంటారు. ఆ బొమ్మ ఇచ్చి దానికో వ్యాఖ్య రాసి పంపమన్నారట. ఈనాటి పాఠకులు విజృంభించి వ్యాఖ్యలు పంపించారు. వాటిలో ఒకవ్యాఖ్య – “దెబ్బకుఠా! మగాళ్ళ ముఠా!!” అదిగో, ఆ మోస్తరులోనే పొద్దులోనూ ఒక ఫోటో శీర్షిక పెడుతున్నాం. అబ్బెబ్బే.. లేదు లేదండి..అలాంటి బొమ్మలుండవు. సంసారపక్షపు నిర్జీవ ప్రతిమల ఛాయాచిత్రములే యుండును. వ్యాఖ్యానమున్నూ మేమే వ్రాయుదుము.

ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం

జుట్టు ఊడుతోంది..
జుట్టు ఊడుతోంది
నా జుట్టు ఊడుతోంది
నీ జుట్టూ ఊడుతోంది
మన జుట్లు ఊడిపోతున్నాయ్!
ఐనా..
జుట్టు ఊడందెవరికి!!

ఇది ఇంటర్నెట్లో వచ్చిన తెలుగు కవిత. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు కూడా ఇంతే భావస్ఫోరకంగా ఉన్నాయి.

వ్యాఖ్య 1. ఆహా, ఎంత బావుందండీ మీ కవిత. ఒక అద్భుత కవితను చదివిన అనుభూతిని కలిగించారు. కవి అ.కేశ రావు గారికి నా సాష్టాంగ దండ ప్రణామములు!

వ్యాఖ్య 2. నాకు!!!

వ్యాఖ్య 3. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. ఇటీవలి కాలంలో ఇంత మంచి కవితను చదవలేదు.

వ్యాఖ్య 4. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. ఇటీవలి కాలంలో ఇంత పనికిమాలిన సరుకును చూడలేదు

వ్యాఖ్య 5. ఇంతకీ కవితేదీ? కవిత ప్రచురించబోయి ఈ బట్టతలవాడి గొడవేదో రాసేసారు.

వ్యాఖ్య 6. రేయ్, నోరు మూసుకోరా కుళ్ళు వెధవా! కవితా హృదయం లేని వాడికిది బట్టతల గొడవగానే ఉంటుందిరా!

వ్యాఖ్య 7. ర్రేయ్ …

-ఇంటర్నెట్టులో కొన్ని కవితలు, వాటిపై కొన్ని విమర్శలూ ఇలా ఉంటాయి!

ఇది కాదు కవిత, ఇలాక్కాదు విమర్శ ఉండవలసింది. కవిత ఎలా ఉండాలో చదవండి. విమర్శ ఎలా ఉండాలో చూడండి.

శతకోటి తాళాలకొహటే చెవి

“సిర్ఫ్ అపనీహీ చాబీసే ఖుల్తే హై.. ఫలానీ తాలే” అనేది ఒకప్పటి మాట

“కిసీభీ చాబీసే ఖుల్తీ హై హమారీ సైట్” అనేది ఇప్పటి మాట!
“మీ ముక్కూ మొహమెరుగని ఏ సైటుకైనా వెళ్ళి, అక్కడ ఖాతాలాంటిదేమీ లేకుండానే దర్జాగా లాగినై, కుర్చీ వేసుక్కూచ్చుని కబుర్లు చెప్పొచ్చ”ట – కాకపోతే ఆ సైటు ఓపెన్ఐడీని అనుమతిస్తే చాలట!

ఓపెనైడీ అనేది ఒహ లైసెన్సు బిళ్ళన్నమాట! దాన్నుచ్చుకుని ఏ సైటుకైనా వెళ్ళొచ్చు, లాగినవొచ్చు. అక్కడ రిజిస్టరు కానక్కరలేదు. ఎలాగో చూడండి.

మీరూ ఓ ఓపెనైడీ తెచ్చుకోండి, ఓ మోపెడ్….

మంచి వాయువులు మంచి వాయువు లనుకుంటే..

అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు.

గ్రీన్‌హౌస్ వాయువులు లేందే మనం భూమ్మీద బతకలేమట. సూర్యుడి నుండి వేడి వచ్చినట్టే వచ్చి తిరిగి వెనక్కి రోదశిలోకి పోతుంది. ఈ గ్రీన్‌హౌసు వాయువులు ఆ శక్తిని పట్టుకుని ఆపి, తిరిగి భూమికి పంపి, వేడిని నిలబెడతాయి. బానే ఉంది.., అయితే ఇప్పుడేఁవిటీ?

ఆ వాయువులు ఎక్కువైపోతున్నాయట. ఎక్కువైపోయి ఉండాల్సిన దానికంటే భూమి వేడెక్కిపోతోందట. లోకఁవంతా గోలెడుతోంది. పొద్దూ గొంతు కలిపింది. పొద్దు సంపాదకుడు త్రివిక్రమ్ రాసిన సంపాదకీయంలో భూమాత తాపం పెరిగిపోతున్న వైనం చెప్పి, దానికి విరుగుడుగా మనమేం చెయ్యాలో కూడా చెప్పారు. చూడండి.

పోతే.. గ్లోబల్ వార్మింగ్ ను తెలుగులో ఏమనాలి? భూతాపం అని ఈనాడంటోంది. తెలుగు పదంలో చర్చ కూడా జరిగింది. మీరేమంటారు?

తెల్లకాగితం

పెద్దలు పిల్లవాడి గొంతులో, పసి(డి)మనసుతో మాట్లాడ్డం అంత సులువేమీ కాదు. ముళ్ళపూడి వెంకటరమణ దీనికో బెంచిమార్కు పెట్టి ఉంచాడు. కొత్తపాళీ గారు ఈ బెంచిమార్కును పరీక్షిద్దామని అనుకున్నారో ఏమో తెలీదు గానీ పిల్లవాడి స్వగతాన్ని కథగా రాయమని మన కథకులను ఉసిగొలిపారు (స్వగతమే రాయాలని ఏం లేదు గానీ అలా రాస్తే బాగుంటుందని అన్నారు) కొత్తపాళీ వారి పిల్లవాడు మరీ బుడుగంత పసోడేం కాదు.., అయినా పసోడే! వారి పిలుపుకు స్పందనగా మన కథకులు చక్కటి కథలు రాసారు. కొల్లూరి సోమశంకర్ గారి తెల్లకాగితం కూడా ఆ పిలుపుకు స్పందనే. సోమశంకర్ గారి పసోడు పసగల వాడే! చదవండి.

కొవ్వలి సత్యసాయి గారు పన్నిన పదవ్యూహం!

జూ. వేణుమాధవ్ హోటల్ సర్వరైతే మినప పప్పూ, బియ్యంతో చేసిన కుడుముని ఏఁవంటాడు?

ఈ కుడుమూ తినక, ఆ సినిమానూ చూడక తెలుగువాడు తెలుగువాడు కాలేడు! అంచేత మీకదేంటో తెలిసే ఉండాలి. మరి ఎందుకాలస్యం..

అందుకోండి మీ ఎలకన్
నొక్కండా లింకున్
పూరించండా గడిన్

కొవ్వలి వారి పదవ్యూహంలోకి ప్రవేశించడానికి ఇదిగాక మరో ఆధారం కూడా ఉంది. ఆ వ్యూహాన్ని ఛేదించే వీకులింకులవే! లోపలికెళ్ళి చెలరేగిపోండి.

శుభారంభ ప్రాప్తిరస్తు! (తరవాతేఁవన్నా గానీండి!)

పూతరేకులాంటి కవితొకటి!

ఓహో, జి.ఎస్.నవీన్ ఈ మధ్య కవితలు రాయడం మొదలుపెట్టారనమాట అని అనుకున్నాం! భలే రాసారే అనీ అనుకున్నాం. అయితే, ఆ కవితా రచన ఇప్పుడు కాదు, చిరుత వయసులోనే మొదలెట్టారని మాకు తెలిసింది. కవితలే కాదు, కార్టూన్లూ వెయ్యగలరు, (గిత్తోడి) కథలూ చెప్పగలరు. సరే.., సాఫ్టువేరు కోడింగు, డీకోడింగు, బగ్గింగు, డీబగ్గింగుల సంగతి చెప్పేదేముంది!
అయితే ఈ సాఫ్టువేరు స్కిల్సును తన కంపెనీకి ఇచ్చేసి, సాఫ్టు స్కిల్సును మాత్రం దాచేసుకున్నారు. ఈ మధ్యే.. వెలికి తీయడం మొదలెట్టారు. ఆయన రాసిన మరో కవిత – “విరహ విలాపాలేలరా…” – ను ప్రచురించాం. ఇది కవిత కాదు, చక్కగా పాడుకోదగ్గ పాట అని పొద్దు సంపాదకవర్గ సభ్యుడన్నారు. చదవండి!

నవీన్ బహుముఖ ప్రజ్ఞను మరింతగా చూడగలమని ఆశిద్దాం.

ఫిబ్రవరి బ్లాగోతం!

వచ్చేసింది ఫిబ్రవరి బ్లాగోతం! ఫిబ్రవరిలో బ్లాగుల్లో ఏమేం జరిగాయో చెబుతూ 2008 ఫిబ్రవరి బ్లాగోగులు అనే వ్యాసం ప్రచురించాం. ఎన్ని బ్లాగులు, ఎన్నెన్ని జాబులో! ఈసారి ఓ ఎన్నిక కూడా పెట్టాం.. జాబు, టపా ఈరెంటిలో మీ ఎంపికేదో చెప్పమంటూ! మీ వోటెయ్యండి మరి!
OpenID ని పొద్దు సపోర్టు చేస్తోంది. త్వరలోనే ఒక వ్యాసమూ వస్తోంది.

వాగ్విలాసము

గద్యం రాసే అలవాటే లేదాయనకు! ఆయన బ్లాగు నిండా కమ్మటి పద్యాలే. పద్యాలకు చిరునామా ఆయన బ్లాగు. అలాంటి ముక్కు రాఘవ కిరణ్ చేత పంతం పట్టి గద్యం రాయించాం. ఓ పూర్తి నిడివి వ్యాసమే రాయించాం. మొత్తానికి అనుకున్నది సాధించాం గదా అనుకుని వ్యాసం చూద్దుం గదా.. ఆయన పద్య రచనాప్రస్థానమే ఆ వ్యాసం!

చిన్నతనంలోనే రాయడం మొదలుపెట్టిన రాఘవ, ఆ అనుభవాలను ఈ వ్యాసంలో నెమరు వేసుకుంటున్నారు. చదవండి.