Archive for June, 2008

మిట్టూరోడి సాహితీ సేద్యం

“నువ్వెన్నన్నా అను ప్రబల్ కన్నా! నాకు ముండమోపులంటే బలే యిష్టిం!” అన్నా.

“అవున్లే వాళ్లకైతే మొగుళ్లుండరు. ఇష్టమొచ్చినట్టు ఆడించొచ్చని నీ ప్లాను!” అనింది నన్ను జడతో వొకటి కొట్టి.

********** **********

పై సంభాషణ ఎక్కడిదో చూచాయగా కూడా గుర్తు పట్టలేకపోయారంటే తెలుగు సాహిత్యంలో మీరు ఒక విశిష్టమైన పార్శ్వాన్నింకా రుచి చూడలేదని అనుకోవలసివస్తుంది. అలివేలు మంగమ్మకొక దండం అనే కథలోని మాటలివి. మీరిదివరకే చదివుంటే, ఈనెల పొద్దు కథల విభాగంలో ప్రచురించాం, మళ్లీ చదవచ్చు.

ఈ నెల పుస్తక సమీక్ష విభాగంలో - ఇదే రచయిత వెలువరించిన జీవిత చిత్రణ మునికన్నడి సేద్యం నవల పరిచయాన్ని కూడా అందిస్తున్నాం.

టపాలో నువ్వొకటంటే వ్యాఖ్యలో నే రెండంటా..

తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా అని సామెత. బ్లాగుల్లోనూ వ్యాఖ్యల్లోనూ ఈ ఒకట్లూ రెళ్ళూ ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో అందుకు మనమేం చెయ్యాలో… పొద్దు సంపాదకుడు రానారె తన సంపాదకీయంలో చర్చిస్తున్నారు, మీరూ పాల్గొని చర్చించండి.

అప్పుడేం జరిగిందంటే..

నవరసాల్లో హాస్యరసానిదో విశిష్ట స్థానం. అసలు రసరాజం హాస్యమేననేవాళ్ళూ ఉన్నారు. అలాగే బ్లాగులందు హాస్యబ్లాగులు వేరయా అని కూడా అనుకోవచ్చు. అలాంటి మేలైన హాస్యబ్లాగుల్లో ఎన్నదగినది “అప్పుడు ఏమి జరిగిందంటే..” అంటూ క్రాంతి “మేడం” రాసే క్రాంతిగాయం బ్లాగు. ఆ బ్లాగుపై పొద్దు సమీక్ష ఇదిగో

ఎవరు అహంకారి?

భార్యాభర్తలిద్దరూ సంసారరథానికి రెండు చక్రాల్లాంటివారు. ఐతే స్వాతిశయం కొద్దీ రెండో చక్రం ఉనికిని గుర్తించకుండా ఒక్కరే లాగబోతే రథం ఒరిగిపోకుండా నిలుస్తుందా? ఒకరి కళ్ళుగప్పి ఇంకొకరు నడచుకోవడం సమర్థనీయమా? అలాంటి ఇద్దరు దంపతుల కథే వింజమూరి విజయ్ కుమార్ రాసిన అహంకారి. ఇంతకూ ఇద్దరిలో ఎవరు అహంకారి? అతిథి శీర్షికలో ఈ కథను ప్రచురించాం, చదవండి.

మనేకా గాంధీ గారి మొగుడి గారి పని

గడి గడువు దగ్గరపడుతోంది. ఇంకా పది పన్నెండు రోజులే ఉంది. సాధకులు ఇంకా ఆధారాలతో కుస్తీలు పడుతున్నట్టే ఉన్నారు. ఏంపర్లేదు, సుగాత్రి గారి బ్లాగుకెళ్తే ఆధారాలకు ఆధారాలు దొరుకుతాయి.

మామూలుగా గళ్ళనుడికట్టును సాధించేందుకు ఆధారాలిస్తారు. ఆ ఆధారాలను అర్థం చేసుకునేందుకు ఆధారాలు - అనగా స్లిప్పులు - ఇవ్వడం ఎక్కడన్నా చూసారా? అదుగో ఆ పని మొదలెట్టారు కొత్తపాళీ, సుగాత్రి గారలు. పదండి ముందుకంటూ తోసుకుపోతున్నారు, ఇతర గడి జ్వరపీడితులు. ఎవరికి తోచిన ఆధారాలు వాళ్ళిస్తూ దూసుకుపోతున్నారు. మచ్చుకో ఆధారం చూడండి.. “మనేకా గాంధీ గారి మొగుడి గారి పని” ఏంటో తెలిస్తే రెండో నాలుగో గళ్ళు నిండినట్టే!

మనేకా గాంధీ ఎవరా? -ఓవర్ టు సుగాత్రి గారి బ్లాగు!

పొద్దులో నెలవంక

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వెలిగించిన ‘నెలవంక’ (Crescent Moon) ను నేడు మరొక రవీంద్రులు తెలుగు నింగిలో ఆహ్లాదకరంగా వెలయించారు. ఆ వెన్నెల్లో మా పాఠకులు తడిసి ఆనందించగలరని భావిస్తున్నాం.

ఊకదంపుడు: “విషయం ఏమి లేకుండా ఇంతసేపు మాట్లాడటానికి .. ఇంత కన్నా మంచి పేరు లేదు - ఒక్క తెలుగు లోనే కాదు - మిగతా భాషల్లో కూడ…” అంటారు ఆ బ్లాగరి. ఆ పేరునే పెట్టుకుని మంచి మంచి జాబులను వెలయిస్తున్న ఊకదంపుడు బ్లాగును సమీక్షిస్తున్నారు, స్వాతికుమారి.

జూన్ నెల గడి

రానారె కూర్చిన జూన్ నెల గడిని ప్రచురించాం, చూడండి.

మే నెల లోని మేలిమి జాబులు

తెలుగు బ్లాగుల్లో మే నెలలో వచ్చిన మాకు నచ్చిన జాబులు ఇవిగో ఇక్కడ చదవండి.