Archive for the 'గడి' Category

ఏడాదెక్కిన గడి

ఈ నెలతో గడి ఏడాది పూర్తిచేసుకొంది. ఏడాదిపాటు ఈ శీర్షిక విజయవంతంగా నడిచిందంటే, దానికి పాఠకులు చూపిన అనూహ్యమైనే ఆదరణే కారణం. గడిపై వ్యాఖ్యలు, స్లిప్పులూ, మాస్-కాపీయింగు, చమత్కారాలు అన్నిటితో ఇది గడి కాదు, బొమ్మల కొలువు అన్నట్టుగా మారిందంటే - దానికి కొత్తపాళీగారి లాటి విజ్ఞులైన పాఠకులే కారణం అని వేరే చెప్పనక్కరలేదు.

త్వరలోనే గడిరూపు రేఖలు మారనున్నాయి -ఒకేపేజీలో మెత్తం గడంతా ప్రింటవుటు తీసుకోడానికి వీలుగా, ఇంటర్ఫేసుని మారుస్తున్నాం.

కొవ్వలి సత్యసాయిగారు మొదటిసారి చేసిన గడి సులువుగా ఉందని అందరూ అన్నారు, అందుకేనేమో ఈసారి ప్రొఫెసరుగారు తన సత్తా ఎంటో చూపారు. అయినా, ఆయన మహిమేంటోగాని - ఈసారి కూడా వారి గడికి మంచి స్పందన వచ్చింది. ఈ నెల గడిని భైరవభట్ల కామేశ్వరరావుగారు సమర్పిస్తున్నారు.

భైరవభట్ల వారు గతంలో కూర్చిన గడికి బహుమతి కూడా ప్రకటించినప్పటికీ, వారా గడిని మరీ ఎత్తులో నిలబెట్టటం చేత బహుమతి అందలేదు. పైగా అప్పట్లో మా.కా. కూడా లేదాయెను. ఈ సారి ఆ సౌకర్యాలన్నీ అమరాయి కాబట్టి, మేం టీ తాగడానికి బయటకి పోతున్నాం, ఇహ మీ ఇష్టం..

కొవ్వలి సత్యసాయి గారు పన్నిన పదవ్యూహం!

జూ. వేణుమాధవ్ హోటల్ సర్వరైతే మినప పప్పూ, బియ్యంతో చేసిన కుడుముని ఏఁవంటాడు?

ఈ కుడుమూ తినక, ఆ సినిమానూ చూడక తెలుగువాడు తెలుగువాడు కాలేడు! అంచేత మీకదేంటో తెలిసే ఉండాలి. మరి ఎందుకాలస్యం..

అందుకోండి మీ ఎలకన్
నొక్కండా లింకున్
పూరించండా గడిన్

కొవ్వలి వారి పదవ్యూహంలోకి ప్రవేశించడానికి ఇదిగాక మరో ఆధారం కూడా ఉంది. ఆ వ్యూహాన్ని ఛేదించే వీకులింకులవే! లోపలికెళ్ళి చెలరేగిపోండి.

శుభారంభ ప్రాప్తిరస్తు! (తరవాతేఁవన్నా గానీండి!)

అనువాద శంకరుడు

కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్ గారు. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని సాధక బాధకాలను వివరిస్తున్నారు.

ఒక నెల తరువాత మళ్ళీ గడిని మీముందుకు తెస్తున్నాం. సమయానికి గడి తీసుకురాకపోయినా, తెచ్చిన గడి మెచ్చేలా ఉంది. పాఠకులు ఎంతో మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ సరిగ్ఘా పూరించి పంపే వారు తక్కువగానే ఉంటున్నారు.

గడిని ఎలా నిర్మించాలి, ఎలా పూరించాలి అనే విషయాలపై నేర్పరులైన కూర్పరులిద్దరు కబుర్లాడుకుంటూ చెప్పే ఏర్పాటు చెయ్యబోతున్నాం. వివరాలు త్వరలోనే!