ఈనాడులో ఫిబ్రవరి 3 న వచ్చిన వ్యాసం తెలుగు వెబ్ లోకాన్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తింది. వికీపీడియాపై దృష్టి కేంద్రీకరించిన ఈ వ్యాసం ఇప్పటి వరకూ వెబ్‌లో తెలుగుపై వచ్చిన వార్తా కథనాల్లోకెల్లా విస్తృతమైనది, లోతైనదీనూ. నెజ్జనులు ఈ వ్యాసాన్ని స్వాగతిస్తూ ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు. తొలికోడి కూడా వారితో గొంతు కలిపి ఈనాడుకు నెనరులు తెలుపుతోంది.
ఇకపోతే బ్లాగు లోకంలో జనవరిలో ఏమెం జరిగాయో గమనించారా? ఎవరెవరేమేం రాసారో చదివారా? చదవలేదా! పోన్లెండి, ఏం పర్లేదు.. ఆ విషయం తెలుసుకునే అవకాశం పొద్దు మీకిస్తోంది. జనవరి బ్లాగుల ప్రస్థానాన్ని లిపిబద్ధం చేసింది, పొద్దు. జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ! అనే పేరుతో ఒక వ్యాసాన్ని ప్రచురించాం. ప్రతీ ఒక్క బ్లాగునూ ఆ వ్యాసంలో పొందుపరచలేకపోయినప్పటికీ, ముఖ్యమైన విషయాలపై జాబులు వెలువరించిన బ్లాగులను అక్కడ ఉంచామనే అనుకుంటున్నాము. ఓసారి చూడండి. దాన్ని మరింత సమగ్రంగా చేసేందుకు మాకు సూచనలివ్వండి.
ఈ వ్యాసంతో పాటే అసూర్యంపశ్య రాసిన ఆ దారి కవితను కూడా ప్రచురించాం.