Archive for the 'వ్యాసాలు' Category

ఏడో చంద్రుడు

ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి పుట్టినరోజు (జూలై 30) సందర్భంగా రావిశాస్త్రి రచనా ప్రస్థానం గురించి పట్రాయని సుధారాణి గారి వ్యాసం సమర్పిస్తున్నాం, చూడండి

ఏటి ఇసుకలో ఇంకిన కబుర్లు, మింటి దారిలో మెరిసిన రాకెట్లు

“చెట్టుకి గమనం లేదని
జాలి పడకు
దాని ప్రయాణమెప్పుడూ
లోపలికే..”

అంటూ లోతైన భావాన్ని అలతి పదాల్లోనే పలికించగల నేర్పరి, వచన కవితకున్న ఆధునిక పోకడలన్నీటినీ గమనించి ప్రయోగాలతో వివధ కవితా ప్రక్రియల్ని ప్రయత్నించి పాఠకులతో ‘ఆహా’ అనిపించుకున్నప్రతిభాశాలి, ఏటి ఒడ్డున అనే శీర్షికతో తన కవితల్ని బ్లాగ్లోకానికీ పరిచయం చేసిన వ్యక్తి మూలా సుబ్రమణ్యం గారు. ఈ వర్ధమాన అంతర్జాల కవితో జరిపిన ముఖాముఖి చదవండి.

ఆ విధంగా కవిత్వం ఎలా రాయాలో తెలిసికొన్నాక..,

రాకెట్ తగలబడుతోందని
బాధపడకు
దాని ప్రయాణమెప్పుడూ
పైపైకే!

అంటూ రాకెట్ ప్రయోగాలనే సైన్సును కవిత్వమనే కళ స్థాయికి తీసికెళ్తున్న ఇస్రో గురించిన సంపాదకీయం చదవండి.

అంతర్జాలంలో వ్యాపారీకరణ

అమెరికా జెండా పట్టుకుని  ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీదకు దిగకముందే అక్కడ టీకొట్టు పెట్టిన అయ్యరు ఆర్మ్ స్ట్రాంగ్ కు టీ అమ్మడానికొచ్చాడంటుంది అంతర్జాలంలో ప్రాచుర్యంలో ఉన్న ఒక కార్టూను. మరి ఆ అయ్యరులాగే ఈ అంతర్జాలంలో నాలుగు డబ్బులు చేసుకునే మార్గాలేవి? ఆ మార్గాలెంట మనమెంత దూరం వెళ్లగలం? అని విశ్లేషిస్తున్నారు తెలుగు బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన గార్లపాటి ప్రవీణ్.

అభినవ భువన విజయం

భట్టుమూర్తి అంటే ఎవరో చెప్పుకోండి చూద్దాం. అష్టదిగ్గజాల్లో ఒక కవి అని అనుకుంటున్నారా..

మరి విశ్వామిత్రుడంటే త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిన బ్రహ్మర్షి అనీ.., వికటకవి అంటే తెనాలి రామకృష్ణ కవి అనీ గదా మీ ఉద్దేశ్యం!

అభినవ భువన విజయం సందర్భంగా వీటి అర్థాలు మారిపోయాయి. ఆ కథేమిటో ఇవాళ్టి అభినవ భువనవిజయము - అంతర్జాలములో అపూర్వ కవిసమ్మేళనము లో చూడండి.

తెలుగులో రాయటం ఎలాగంటే..

పై శీర్షికను బిగ్గరగా చదవండి. “తెలుగులో రాయ..” వరకు చదవగానే మన బ్లాగరులు ఠక్కున అందుకుని కంప్యూటర్లో తెలుగులో ఎలా రాయాలో చెప్పెయ్యడం మొదలెట్టేస్తారు, తెరపట్టులతో సహా! రాసే పద్ధతి ఇప్పుడెలా ఉందో చెప్పటమే కాకుండా, ఓ నాలుగైదేళ్ళ తరవాత ఎలా మారబోతోందో కూడా చెప్పేస్తారు. (అలాంటి ఉత్సాహవంతుల కారణంగానే అంతర్జాలంలో తెలుగు ఉజ్వలంగా వెలుగుతోంది. అది మరువరాదు)

అయితే.. కొడవటిగంటి రోహిణీప్రసాదుగారు కాలంలో వెనక్కివెళ్ళి అసలు లిపి ఎలా పుట్టింది అనే సంగతిని వివరిస్తున్నారు. ఆశ్చర్యపరచే విషయమేంటంటే.. ఆ ప్రాచీన లిపులను నేరుగా రాసెయ్యొచ్చట, మన ఇన్‌స్క్రిప్టు లాగా! ముందు ఇంగ్లీషులో (రోమను లిపిలో) రాసి ఆపైన లిప్యంతరీకరణ చెయ్యనక్కరలేదు. మీరూ అవాక్కయ్యారా? కామూ మరి!!! ప్చ్! అవున్లెండి, పురాతన లిపులు కదా.. అంతగా అభివృద్ధి చెందినట్టు లేవు.

ఈ మధ్య ఈనాడులో ఒక ఫోటో పెట్టారు. ఒక పొడుగు కాళ్ల సుందరి రోడ్డుమీద దర్జాగా నిలబడి ఉంటుంది. మగ జనం ఒక వరుసలో ఆ రోడ్డు మీద పడుకుని, మోరలెత్తి ఆ సుందరి దయార్ద్ర దృక్కుల కోసమా అన్నట్టు చూస్తూంటారు. ఆ బొమ్మ ఇచ్చి దానికో వ్యాఖ్య రాసి పంపమన్నారట. ఈనాటి పాఠకులు విజృంభించి వ్యాఖ్యలు పంపించారు. వాటిలో ఒకవ్యాఖ్య - “దెబ్బకుఠా! మగాళ్ళ ముఠా!!” అదిగో, ఆ మోస్తరులోనే పొద్దులోనూ ఒక ఫోటో శీర్షిక పెడుతున్నాం. అబ్బెబ్బే.. లేదు లేదండి..అలాంటి బొమ్మలుండవు. సంసారపక్షపు నిర్జీవ ప్రతిమల ఛాయాచిత్రములే యుండును. వ్యాఖ్యానమున్నూ మేమే వ్రాయుదుము.

ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం

జుట్టు ఊడుతోంది..
జుట్టు ఊడుతోంది
నా జుట్టు ఊడుతోంది
నీ జుట్టూ ఊడుతోంది
మన జుట్లు ఊడిపోతున్నాయ్!
ఐనా..
జుట్టు ఊడందెవరికి!!

ఇది ఇంటర్నెట్లో వచ్చిన తెలుగు కవిత. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు కూడా ఇంతే భావస్ఫోరకంగా ఉన్నాయి.

వ్యాఖ్య 1. ఆహా, ఎంత బావుందండీ మీ కవిత. ఒక అద్భుత కవితను చదివిన అనుభూతిని కలిగించారు. కవి అ.కేశ రావు గారికి నా సాష్టాంగ దండ ప్రణామములు!

వ్యాఖ్య 2. నాకు!!!

వ్యాఖ్య 3. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. ఇటీవలి కాలంలో ఇంత మంచి కవితను చదవలేదు.

వ్యాఖ్య 4. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. ఇటీవలి కాలంలో ఇంత పనికిమాలిన సరుకును చూడలేదు

వ్యాఖ్య 5. ఇంతకీ కవితేదీ? కవిత ప్రచురించబోయి ఈ బట్టతలవాడి గొడవేదో రాసేసారు.

వ్యాఖ్య 6. రేయ్, నోరు మూసుకోరా కుళ్ళు వెధవా! కవితా హృదయం లేని వాడికిది బట్టతల గొడవగానే ఉంటుందిరా!

వ్యాఖ్య 7. ర్రేయ్ …

-ఇంటర్నెట్టులో కొన్ని కవితలు, వాటిపై కొన్ని విమర్శలూ ఇలా ఉంటాయి!

ఇది కాదు కవిత, ఇలాక్కాదు విమర్శ ఉండవలసింది. కవిత ఎలా ఉండాలో చదవండి. విమర్శ ఎలా ఉండాలో చూడండి.